ప్రజల సుఖసంతోషాల కోసం దుర్గామాతకు ప్రత్యేక పూజలు,ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు.
ధన్వాడలో చండీ హోమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు దంపతులు.
మంథని, అక్టోబర్ 15, అర్జున్ సమాచారం:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన చండీ హోమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం నిండాలని ప్రార్థించారు.
అనంతరం వేద పండితులు దుద్దిళ్ల శ్రీనుబాబు దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగల ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.